కామారెడ్డి, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీిలోని మహారాష్ట్ర సధన్‌లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్ అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్‌తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ విచారణలో తెలంగాణలోని వీరశైవ లింగాయత్‌తో పాటు 40 కులాలను ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్‌ని కోరారు.
40 కులాలు ఓబిసి జాబితాలో లేకపోవటం వలన ఆ సామాజిక వర్గాలకు చెందిన బీసీలు, కేంద్రంలో విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు ఫలాలు కోల్పోతున్నారని ఆధారలతో సహా జాతీయ బీసీ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంలో ముందడుగు పడటం లేదని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ వెనుకబడిన కులాలపై లోతుగా అధ్యయనం చేసి వారి స్థితిగతులను తెలుసుకోని ఇప్పటికే పలుమార్లు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై జాతీయ బీసీ కమిషన్ సానుకూలంగా స్పందించి తెలంగాణలోని 40 కులాలను న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఓబిసి జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఎన్సీబీసీ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్ తెలిపారు.