డిచ్‌పల్లి, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి కళా నిలయంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించగా, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ, ముఖ్యఅతిథి, ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య లింబాద్రి, శాసనమండలి సభ్యులు వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు హాజరైనారు.
కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని శాలువా, మెమొంటో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రోత్సాహకంగా నగదు పారితోషకం పదివేల రూపాయలు అందజేశారు. ప్రొఫెసర్ ఎం. యాదగిరి ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్‌గా కొనసాగుతున్నారు.
కామర్స్ సీనియర్ ప్రొఫెసర్, డీన్, హెడ్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌గా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎగ్జామినేషన్స్ కంట్రోలర్గా, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్గా, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్ డైరెక్టర్గా పనిచేశారు. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మూడేళ్లపాటు రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు.
అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లు మరియు వర్క్ షాపులను నిర్వహించారు. ఆచార్య యాదగిరి పర్యవేక్షణలో నేటి వరకు 13 మంది అభ్యర్థులకు పిహెచ్ డి డిగ్రీలు ప్రదానం చేశారు. ప్రస్తుతం 8 మంది పీహెచ్డీ అభ్యర్థులు తమ పరిశోధనను కామర్స్‌లో అభ్యసిస్తున్నారు. అండర్-గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మరియు టాక్సేషన్‌లో 51 పుస్తకాలను రచించారు.
తెలుగు అకాడమీ, హైదరాబాద్ వారు ప్రచురించిన 6 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వారి పరిశోధన ప్రచురణలలో ప్రసిద్ధ జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్లో సుమారు 85 పరిశోధనా వ్యాసాలు ఉన్నాయి. 31 జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యారు. అండర్-గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం వివిధ రేడియో పాఠాలను సిద్ధం చేశారు.
అత్యంత పేదరికంలో పుట్టిన ఆచార్య యాదగిరి నిరంతరం కష్టపడుతూ, పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తూ, ఆచరణాత్మకంగా ముందుకెళ్తున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా ఆచార్య యాదగిరికి ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్, కంట్రోలర్ ఆచార్య అరుణ, యూజీసీ డైరెక్టర్ డాక్టర్ ఆంజనేయులు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి, కామర్స్ ప్రొఫెసర్ రాంబాబు, వీఆర్వో డాక్టర్ పున్నయ్య, అన్ని శాఖల విభాగాధిపతులు టీచింగ్, నాన్ టీచింగ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.