కామారెడ్డి, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 నాటికి వైద్య కళాశాలలో పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర తెలంగాణ వైద్య సేవ మౌళిక సదుపాయాల అభివృధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వైద్యకళాశాలలో నాలుగు బ్లాకులలో పురోగతిలో ఉన్న పనులను పరిశీలించి పరిపాలన విభాగం, అనాటమీ, లెక్షర్ గ్యాలరిలో మిగిలిపోయిన ఫ్లోరింగ్, కార్పెంటరీ పనులను, సి.సి. రోడ్డు నిర్మాణ పనులను, ఇతర చిన్న చిన్న పనులను పూర్తి చేయాలన్నారు.
ఫర్నీచర్, సౌండ్ సిస్టం, ప్రొజెక్టర్, ఇంటర్నెట్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం తరగతులు ఈనెలలోనే ప్రారంభించుటకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇందులో చదివే వంద మంది వైద్య విద్యార్థిని, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలను పరిశీలించి చెక్ లిస్ట్ ప్రకారం వైద్య కళాశాల, వసతి గృహాలకు కావలసిన అన్ని మౌళిక సౌకర్యాలు కల్పించాలన్నారు.
నీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ఫైర్ సేఫ్టీ, భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహ్లాదకార వాతావరణానికి చక్కటి పచ్చిక బయళ్లు ఏర్పాటుచేయాలన్నారు.
అంతకుముందు 250 పడకల స్థాయికి పెంచుతూ జిల్లా ఆసుపత్రి పై భాగాన నిర్మించిన నూతన భవనంలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పెంచిన పడకల స్థాయికి అనుగుణంగా వెంటనే బెడ్స్ తెప్పించాలని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మికి సూచించారు.
ఆసుపత్రిలోని ఐ.సి.యు., బాలింతల గదులను పరిశీలించి నీరు లీకేజీ కాకుండా మరమత్తులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రోగులను, బాలింతలను పరమార్శిస్తు డాక్టర్లు సమయానికి వచ్చి చెక్ చేస్తున్నారా, మందులు సరిగ్గా వేసుకుంటున్నారా, అల్పారం ఇచ్చారా అని ఆరా తీశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఇట్టి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. వెంకటేశ్వర్, ఈఈ చంద్రశేఖర్, డిప్యూటీ ఈ ఈ సుధాకర్, ఏ ఈ అరవింద్, గుత్తేదారు, తదితరులు పాల్గొన్నారు.