నిజామాబాద్, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్ వద్ద కొనసాగుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాల పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
మరో మూడు పాఠశాలల పనులు తుది దశల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, డార్మెటరీ, లైబ్రరీ, లాబ్ రూమ్‌లు, కిచెన్, డైనింగ్ హాల్, రాంప్, టాయిలెట్స్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు, గుత్తేదారుకు పలు సూచనలు చేశారు. ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులను సైతం చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
ఒక చోట నిర్మాణ పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్ తెలుపగా, ఆ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడే అధికారులతో ఈ సమస్యలపై చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఇంజినీరింగ్ విభాగం ఈ.ఈ దేవిదాస్, ఏ.ఈ ఉదయ్ తదితరులు ఉన్నారు.