కామారెడ్డి, సెప్టెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు,సవరణలు, తొలగింపులకు సంబంధించి చేపట్టిన స్పెషల్ డ్రైవ్, స్వీప్ కార్యకలాపాలకు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ గత జులై నుంచి ఈ నెల 5 వరకు చేపట్టిన విస్తృత ప్రచార కార్యక్రమాల వల్ల ఓటరు నమోదుకు 12,366, మార్పులు, చేర్పులకు సంబంధించి 3,160 దరఖాస్తులు, తొలగింపులకు సంబంధించి 752 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
వచ్చిన ధరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని, ఈ నెల 19 నాటికి ఓటరు నమోదు సంబంధించి పెండిరగులో ఉన్న 10,814 ధరఖాసులతో పాటు పెండిరగులో ఉన్న 3,558 ఇతర 7,8 ఫారాలను డిస్పోజ్ చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా బూత్ స్థాయిలో ఉన్న ఓటరు ముసాయిదాను జాబితాను పరిశీలించి ప్రముఖుల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు, వార్డు సభ్యులు తదితర పేర్లు జాబితాలో ఉన్నాయో లేవో పున :పరిశీలించుకుని, తొలగిపోతే ఫారం-6 ద్వారా నమోదు చేయించాలన్నారు.
రాబోయే ఎన్నికలకు అక్టోబర్ 4 న ప్రకటించబోయే తుది ఓటర్ల జాబితానే ప్రామాణికమని, ఈ నెల 19 వరకు మాత్రమే ఓటరు నమోదుకు అవకాశమున్నందున ఓటరు నమోదు తో పాటు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలన్నారు. ఓటర్ తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలున్నాయని, మరణ ధ్రువపత్రం పొంది, నోటీసు ఇచ్చిన పక్షం రోజుల తరువాతే తొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు.
స్వీప్ ద్వారా కళాశాల స్థాయిలో ఓటరుకు నమోదుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 1,2023 నాటికీ 18 సంవత్సరాలు నిండే యువ ఓటర్లు, ప్రధానంగా యువ మహిళా ఓటర్ల నమోదుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకటన తరువాతపోలింగ్ బూతులపై ప్రత్యేక దృష్టిపెట్టి రాంప్, వీల్ చైర్, మంచి నీటి సౌకర్యం, శౌచాలయాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు చూస్తామన్నారు.
అదేవిధంగా వ్యయ నియంత్రణ, వీడియోగ్రఫీ,పోలింగ్ సిబ్బంది కి శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఏజెంట్‌ల నియామకానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులను నియమించుకోవలసినదిగా సూచించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్ కుమార్, బాలరాజు, ఖాసిం అలీ, మదన్లాల్ జాదవ్, మహమ్మద్ జఫ్ఫార్ ఖాన్, మహమ్మద్ ఫయాజ్, వెంకట్ గౌడ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ ఇందిర ప్రియదర్శిని పాల్గొన్నారు.