శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓలు, డిఎస్పీ లతో కలిసి వినాయక చవితి, మిలాబ్‌-ఉన్‌ -నబి పండుగల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 18 న ప్రారంభమై 28 న నిమజ్జనంతో ముగుస్తుందని, నిమజ్జనం రోజు మిలాద్‌ ఉన్‌ నబి పండుగ వచ్చిన నేపథ్యంలో హిందూ, ముస్లిం సోదరులు సోదర భావంతో మెలిగి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుగుకోవాలని కోరారు. గణేష్‌ మండపాల ఏర్పాటుకు జాబితా అందజేస్తూ ముందస్తుగా పొలిసు వారి అనుమతి తీసుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని గణేష్‌ ఉత్సవ కమిటీకి సూచించారు.

శోభాయాత్ర జరిగే రహాదారులు గుంతలు లేకుండా చూడాలని, ఆర్‌ అండ్‌ బి, మునిసిపల్‌ అధికారులకు సూచించారు. జిగ్నేకే రాత్‌ సందర్భంగా ముస్లిం సమాధుల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రాత్రి వేళలో విద్యుత్‌ అంతరాయం కలగకుండా, తీగలు వేలాడకుండా చూడాలన్నారు. శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ను రూపొందించాలని,
ఎలాంటీ చిన్న సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, రహాదారుల వెంట చెట్ల కొమ్మలను తొలగించాలని, రహదారులు బురద మయం లేకుండా చూడాలని అన్నారు.

చెరువుల వద్ద ఎలాంటి తొక్కిసలాటలు, నీటి ప్రమాదాలు జరగకుండా బ్యారీ కేడిరగ్‌ ఏర్పాటు చేయాలని, గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, అవసరమైన క్రేన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, నిమజ్జన ప్రదేశాలలో వైడ్‌ శిబిరం, అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. శోభాయాత్ర దారి వెంట పూలు, వాటర్‌ బాటిల్స్‌ తొలగించాలని, భక్తులకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.నిమజ్జనానికి 24 గంటల ముందు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని కలెక్టర్‌ తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు, నీరు కలుషితం కాకుండా మట్టి గణపతి ప్రమితాల్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎసి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ శాంతికి, మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా వాసులను కొనియాడారు. రెండు పండుగలు ఒకేసారి వచ్చిన నేపథ్యంలో హిందూ, ముస్లింలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.

గణేష్‌ మండపాలు, మైకు, సౌండ్‌ సిస్టం ఏర్పాటుకు ముందస్తుగా అనుమతి పొందాలని, డి.జె.లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఎస్పీలు ప్రకాష్‌, శ్రీనివాసులు, జగన్నాథ్‌ రెడ్డి, ఆర్డీఓలు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభాకర్‌, భుజంగరావు, మూడు నియోజక వర్గాల నుండి ముస్లిం మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »