కామారెడ్డి, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య కళాశాల ప్రారంబోత్సవాన్నికి తుది ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ పెద్ద్డతిలో వైద్య కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ పనుల ఏర్పాట్లను పరిశీలించుటకు వచ్చిన వైద్య విద్య సంచాలకులు ఆదివారం నాడు ఇంజనీరింగ్ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ తో కలిసి నిర్మాణాలు పూర్తైన బ్లాకులను, కల్పిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు.
మిగిలిపోయిన ప్యాచ్ వర్కులు, చిన్న చిన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. విద్యనభ్యసించే వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి వసతి కల్పించాలని సూచించారు. అడ్మిషన్స్ కూడా ముగింపు దశకు చేరుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల ప్రారంభమైన వెంటనే మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ గా తరగతులను బోధించుటకు వీలుగా పూర్తి ఎక్విప్మెంట్ తో ల్యాబ్ లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.