టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్‌ – 2023 (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. టెట్‌ రాత పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో, సాఫీగా పరీక్ష నిర్వహించాలని, నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ సూచించారు.

ఉదయం 9:30 గంటల నుండి 12:00 గంటల వరకు మొదటి సెషన్‌ లో జరిగే పేపర్‌-1 పరీక్షకు జిల్లాలో 15,263 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే, రెండవ సెషన్‌ లో మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే పేపర్‌-2 పరీక్షకు 11,573 హాజరు కానుండగా, 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఒక్కో గదిలో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రశ్న పత్రాల బుక్‌ లెట్‌, ఓ.ఎం.ఆర్‌ షీట్ల పంపిణీ, హాజరు సేకరణ, అభ్యర్థుల నిర్ధారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ, సందేహాలను నివృత్తి చేశారు. మొదటి సెషన్‌ కు సంబంధించి ఉదయం 9.00 గంటల్లోపు, రెండవ సెషన్‌ కు సంబంధించి మధ్యాహ్నం 2.00 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలోకి చేరుకోవాలని సూచించారు. సెల్‌ ఫోన్‌, క్యాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అనుమతి లేనందున వాటిని వెంట తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే షూస్‌ వేసుకోకూడదని, చెప్పులు ధరించి రావాలన్నారు.

కాగా, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్ష సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, సరిపడా వెలుతురు, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరీక్షా సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు.

టెట్‌ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ : 9030282993 ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌, డీ.ఐ.ఈ.ఓ రఘురాజ్‌, పరీక్షల నియంత్రణ విభాగం సహాయ కమిషనర్‌ విజయ భాస్కర్‌, డిపార్ట్మెంటల్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »