నిజామాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సీ.ఈ.ఓ వికాస్ రాజ్ సోమవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కొరకు ఓటర్ నమోదు ప్రక్రియను తప్పిదాలకు ఆస్కారం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని, గత ఎన్నికలలో తక్కువ పోలింగ్ శాతం నమోదైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, ఈసారి ఓటర్లకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా, వంద శాతం పోలింగ్ నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసిన వివరాలు, బి ఎల్ ఓల దగ్గర ఉన్న ఓటర్ల జాబితా తప్పనిసరిగా సరిపోల్చుకుని పరిశీలించాలని, ప్రత్యేక శిబిరాల ద్వారా ఎంత శాతం ఓటర్ నమోదు చేశారు, వాటికి సంబంధించిన వివరాలు అన్నీ డాటాలో పొందుపరచాలని మార్గనిర్దేశం చేశారు. అలాగే మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో ఉన్న పీవీటిజి ఓటర్లు, ఆదివాసి గిరిజనులకు సంబంధించిన ఓటర్లు, సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్స్ అందరిని గుర్తించి కేటగిరీల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, 18 నుండి 19 సంవత్సరాలు వయస్సు కలిగిన యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
ఈసారి జరగబోయే ఎలక్షన్లలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వంద శాతం పోలింగ్ అయ్యేలా చూడాలని, ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా వికలాంగులు, 80 సంవత్సరాలు నిండిన వారు, సెక్స్ వర్కర్ల వివరాలు వెబ్సైట్లో నమోదు చేసి తప్పనిసరిగా మార్కింగ్ వేయాలని, కాలేజీ మరియు పాఠశాలల్లో ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, బి ఎల్ ఓ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, సంబంధిత ఈఆర్‌ఓలు,ఎఈఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.