కదంతొక్కిన బీడీ కార్మికులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ 4 వేల రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది బీడీ కార్మికులతో ధర్నాచౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బట్టివాలా, చెన్నివాల, సార్టర్‌, ప్యాకర్స్‌, వాచ్మెన్‌ తదితర నెలసరి వేతన కార్మికులందరికీ నెలకు 4 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

బీడీ కార్మికులకు నెలలో పది రోజులలోపే పని దొరుకుతుందన్నారు. ఒకవైపు విపరీతంగా పెరిగిన ధరలు మరోవైపు పని దొరకకపోవడంతో బీడీ కార్మిక కుటుంబాలకు జీవనం భారం అవుతుందన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న నెలసరి వేతన కార్మికులకు కూడా అతి తక్కువ వేతనాలు ఉండడంతో వారి జీవనం కూడా కష్టమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో బీడీ పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.

ప్రస్తుతం ఇస్తున్న 2016 రూపాయల జీవనభృతి పెరిగిన ధరలకు సరిపోవడం లేదన్నారు. అదేవిధంగా ఇంకా వేలాదిమంది బీడీ కార్మికులు జీవనభృతికి దూరంగా ఉన్నారన్నారు. జీవనభృతి దరఖాస్తుపై ఉన్న ఫ్రీజింగ్‌ ను ఎత్తివేసి, బీడీలు చేసే కార్మికులందరికీ 4 వేల రూపాయల జీవనభృతి అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్‌ మాట్లాడుతూ కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరించాలన్నారు. కానీ నేటికి 12 సంవత్సరాలు గడిచిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించలేదన్నారు. తద్వారా బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4 వేల జీవన భృతి ఇవ్వాలన్నారు. లేనిచో బీడీ కార్మికులను ఏకంచేసి అదికార పార్టీ ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటామన్నారు.

భారీ ర్యాలీ, మహాధర్నాలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న, ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్‌, యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్‌, సత్తెక్క, జిల్లా సహాయకార్యదర్శి డి.కిషన్‌, కోశాధికారి లాలయ్య నాయకులు సాయరెడ్డి, లింగం, మురళి, రాజేశ్వర్‌, అరవింద్‌, కిరణ్‌ పి.డి.ఎస్‌.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్‌, ఏఐపీకేఎమ్మెస్‌ జిల్లా అధ్యక్షుడు సాయగౌడ్‌, నాయకులు సాయరెడ్డి మరియు 8వేల మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »