నిజామాబాద్, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.
గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. కనీసం పక్షం రోజులకోసారి సమీక్ష నిర్వహించుకుంటూ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా రుణ మాఫీ పొందిన రైతులందరికీ కొత్తగా పంట రుణాలను అందించాలని, ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం పంట రుణాల రెన్యూవల్ జరగాలని గడువు విధించారు.
ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలోనూ బ్యాంకర్లు అంగీకరించారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం వర్తింపజేసిన రుణమాఫీ రైతుల చేతికి చేరాలని, అప్పుల కింద వాటిని మినహాయించుకోవద్దని బ్యాంకర్లకు సూచించారు.
వ్యవసాయ శాఖతో పాటు ఇతర పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తదుపరి సమావేశం నాటికి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు.
స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో అందిస్తున్న శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని సమన్వయకర్త శ్రీనివాస్ కోరారు.
సంబంధిత సంస్థ ద్వారా చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో కూడిన వార్షిక నివేదికను అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా విడుదల చేశారు. కాగా, ఈ ఏడాది వ్యవసాయ రంగానికి 6568.30 కోట్ల రూపాయల రుణాలు అందించాలని లక్ష్యం కాగా, జూన్ నెలాఖరు నాటికి రూ. 2837.42 కోట్లను పంపిణీ చేసి 43.20 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ రావు తెలిపారు. సమావేశంలో ఆర్.బి.ఐ ఏజీఎం అనిల్ కుమార్, డీఆర్డీఓ చందర్, మెప్మా పీ.డీ రాజేందర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.