కామారెడ్డి, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎన్నికలు పాకడాబందీగా నిర్వహించుటకు వివిధ విభాగాలకు సంబంధించి నియమించిన 17 మంది నోడల్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంసిద్దంపై ఎన్నికల సంఘం 32 స్లైడ్స్ రూపొందించిందని అన్నారు.
సంబంధిత నోడల్ అధికారులు మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై సంపూర్ణ అవగాహన కలిగి నోడల్ అధికారిగా తమ పరిధికి సంబంధించిన అంశం స్లైడ్‌ల పై రెండు రోజులలో సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 3 శానసభ నియోజక వర్గాలతో పాటు బాన్సువాడలోని కొంత భాగం కలిపి మొత్తం 913 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి పోలింగ్ బూత్ అనుసంధానం అయ్యేవిధంగా రూట్ మ్యాప్ రూపొందించాలన్నారు. వివిధ కమిటీలు, సిబ్బందికి అవసరమైన వాహనాలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఈ నెల 19 వరకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు అవకాశమున్నందున ఎక్కువ సంఖ్యలో అర్హులైన యువ ఓటర్లను నమోదు చేయాలన్నారు. ప్రధానంగా జిల్లాలో 18 ఏళ్ళు నిండిన యువత, మహిళా ఓటర్లు ఇంకా మిగిలిపోయారని ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించేలా చొరవ చూపాలన్నారు.
అదేవిధంగా ట్రాన్సజెండర్లు, సెక్స్ వర్కర్లు, దివ్యంగులను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని కోరారు. లింగ నిష్పత్తి, జనాభా మేరకు ఈ.పి ఓటరు నిష్పత్తి ఉండేలా చూడాలన్నారు. ఓటరు జాబితాలో దివ్యంగుల పేర్లు తప్పనిసరిగా మార్కు చేసి ఉండాలని, తద్వారా పోలింగ్ రోజున వారికీ అవసరమైన సేవలు అందించడానికి వీలుంటుందని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో, చక్కటి వెలుతురు, ఫర్నీచర్, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం, ర్యాంప్‌తో పాటు వీల్ చైర్ ఉండేలా చూడాలన్నారు.
ప్రతి కేంద్రం వెబ్ కాస్టింగ్ పరిధిలో ఉండాలన్నారు. ప్రతి ఎన్నిక కత్తిమీద సాములాంటిదని, ఎన్నికల నిర్వహణపై ఏమైనా సందేహాలుంటే నేరుగా తనకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, సిపిఒ రాజారామ్, ఇతర నోడల్ అధికారులు, ఎన్నిక విభాగం సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.