భీంగల్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలుషిత ఆహరంతో విద్యార్థినులు అస్వస్థకు గురైన భీంగల్ కస్తూరిబా గాంధీ (కెజిబివి) స్కూల్‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్‌లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని కలియతిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్ధినిలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంటు ద్వారా సురక్షిత మంచి నీళ్ళు వస్తున్నాయా అని మంత్రి వారిని అడగ్గా వస్తున్నాయని బదులిచ్చారు. మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని, మీరు బాగా చదువుకోవాలని విద్యార్థినులకు మంత్రి భరోసా కల్పించారు.
ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు. కూరగాయలు,పప్పులు,బియ్యం శుభ్రంగా ఉంచాలని మన ఇంట్లో పిల్లలను ఎలాగైతే శ్రద్ధగా చూసుకుంటామో ఇక్కడ ఉన్న పిల్లలను కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ఇట్లాంటి ఘటనలు భవిష్యత్ లో పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థినులకు ప్రభుత్వ మెనూ ప్రకారం శుచి అయిన పౌష్ఠిక ఆహారం అందించాలని ఆదేశించారు. తాను మళ్ళీ ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీ చేస్తానని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పాఠశాలలో విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం, వసతి లేకుంటే ఎవ్వరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పర్యవేక్షణ చేయాలని ఆదేషించారు. వంట గది, స్టోర్ రూమ్, బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉండటానికి చేయవలసిన చిన్న చిన్న పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించి, అక్కడి నుండే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో ఫోన్లో మాట్లాడి మంత్రి పలు సూచనలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం విద్యార్థినిలకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్ఠిక ఆహారం అందిస్తోందని, విద్యార్థినిల విద్యా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి వేముల తేల్చి చెప్పారు. మంత్రి వెంట పలువురు అధికారులు, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.