నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా స్వయంగా విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ కార్మికుల పెండిరగ్ బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా పెంచిన వేతనాలు ఏరియాస్ తో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ వాళ్ళ ఖాతాలో జమ చేయలేదని అన్నారు.
సమ్మె అనంతరం రాష్ట్ర కమిటీగా ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన సమస్య పరిష్కరించకపోగా కొత్త మెనూ ప్రకారం కార్మికులకు భోజనాలు పెట్టాలని, ఉదయం రాగిజావ పెట్టాలని వారానికి రెండు గుడ్లు, మూడు రకాల కూరగాయలు, పప్పులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈనెల 20వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల బకాయి వేతనాలు బకాయి బిల్లులు, కొత్త మెనూ చార్జి 25 రూపాయలు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం, గుర్తింపు కార్డులు, యూనిఫారం ఇవ్వని ఎడల సమ్మెకు వెళ్తామని సమ్మె ద్వారా జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ధర్నా కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయమ్మ, చక్రపాణి, ఉషారాణి, రూప, భూమయ్య, నాగలక్ష్మి, ఉమా, గంగాధర్, బాలరాజు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.