కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటె తెలపాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది, పవిత్రమైనదని, దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు ఆయుధంలాంటిదని, ఓటరుగా నమోదయిన ప్రతి ఒకరు తప్పక ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలన్నారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్ళు నిండే వారు రాబోయే ఎన్నికలలో ఓటరు హక్కు వినియోగించుకునే సువర్ణావకాశం ఉన్నదని యువతలో అవగాహన కలిగిస్తూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు.
జిల్లాలో ఓటరుగా నమోదు కానీ యువత ఇంకా మిగిలిఉన్నారని, స్వీప్ ద్వారా కళాశాలలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ఓటరుగా నమోదు చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఫారం-6 ద్వారా గాని, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా గాని ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఓటర్ల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. ఏ.వి.ఏం. ల ఓటు వేసే విధానంపై డెమో ఇస్తూ ప్రజలలో అవగాహన కలిగిస్తున్నామన్నారు.
సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాసిం అలీ, మదన్ లాల్ జాదవ్, జూకంటి ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్, నరేందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.