ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక చతుర్థి, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు వంటి సౌకర్యాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ముఖ్యంగా గణేష్‌ పండుగ, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క ప్రాణ నష్టం సంభవించకూడదని అన్నారు. ముఖ్యంగా విద్యుదాఘాతం బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయంలో ట్రాన్స్‌ కో తో పాటు పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఆయా ప్రాంతాల్లో నెలకొల్పే గణేష్‌ మంటపాల వివరాలను తప్పనిసరిగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులకు జాగ్రత్తలు సూచించాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా కూడా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాల నిమజ్జనం చేసే ప్రక్రియ ఆద్యంతం అధికారుల పర్యవేక్షణలో జరగాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్‌, లైటింగ్‌ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడిరగ్‌, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

గణేష్‌ పండుగ సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలు, వదంతులను నమ్మకూడదని, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. ఎలాంటి సమస్య నెలకొని ఉన్నా, ప్రజలు నేరుగా తన దృష్టికి కూడా తీసుకురావచ్చని సూచించారు. కాగా, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయిస్తామని పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తెలిపారు.

సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టింగ్‌ లపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతామని అన్నారు. సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకుందామని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈసారి జిల్లాలో సుమారు 4500 వరకు వినాయక విగ్రహాలు ప్రతిష్టించే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు.

పరస్పర సహకారంతో సహృద్భావ వాతావరణంలో వేడుకలు : జెడ్పి చైర్మన్‌

కాగా, పరస్పర సహకారంతో సహృద్భావ వాతావరణంలో మిలాద్‌-ఉన్‌-నబీ, గణేష్‌ చతుర్థి వేడుకలు జరుపుకుందామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు సూచించారు. శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సెక్యులర్‌ రాష్ట్రంగా పరిఢవిల్లుతోందని, అన్ని మతాలు, కులాల వారిని ప్రభుత్వం గౌరవిస్తూ అధికారికంగా వేడుకలు జరుపుతోందని గుర్తు చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీతో పాటు, రంజాన్‌, క్రిస్మస్‌ సందర్భంగా కూడా దుస్తులు పంపిణీ చేస్తూ, విందులు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగానే ప్రజలందరూ కలిసికట్టుగా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌, డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌, డీసీపీ జయరాం, అదనపు డీసీపీ గిరిరాజా, ఆర్దీవోలు రాజేంద్ర కుమార్‌, రాజాగౌడ్‌, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »