నిజామాబాద్, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా మనుషులను, మనసులను కలిపి ఉంచే భాష హిందీ అని, హిందీ కేవలం భాష మాత్రమే కాదని భారతీయుల అంతరాత్మ వంటిదని అన్నారు.
రాబోయే తరాలకు హిందీ భాషలో ఉన్న మాధుర్యాన్ని అందించాలని, మన అమ్మ లాంటి భాషను కాపాడుకోవాలని సూచించారు,హిందీ నేర్చుకోవడం వల్ల కేవలం భారత్ లోనే కాదు యావత్ ప్రపంచంలో ఎన్నో వందల దేశాల్లో సునాయాసంగా సంభాషించవచ్చని అన్నారు. హిందీ మన జాతీయ భాష అయినందున హిందీని మనందరం కలిసి కాపాడుకుందామని కోరారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారి రాజా శంకర్ పాల్గొని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ భాషలోనే మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ హిందీ కవి సీతారాం పాండే, జాతీయ స్థాయి హిందీ కవి శ్రీమన్నారాయణ విరాట్ తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన హిందీ కవులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, హిందీ విద్యార్థులు, హిందీ భాషాభిమానులు పాల్గొన్నారు. ఔత్సాహిక హిందీ విద్యార్థులు తమ తమ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శైలి బెల్లాల్ సత్కరించారు.