కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరగబోయే రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్- (టెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణ కోసం నియమించిన 360 మంది చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, హాల్ సూపెరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని సూచించారు.
ఎలాంటి పొరపాట్లకు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఒక యజ్ఞంలా భావించి అందరు సమన్వయంతో నిబద్దతగా పనిచేయాలని కోరారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు నిర్వహించే మొదటి పేపర్‌లో 5,535 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నారని ఇందుకోసం జిల్లా కేంద్రంలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా మధ్యాన్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే రెండవ పేపర్ కు 4,205 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నారని ఇందుకోసం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టెట్ పరీక్ష సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి పరీక్షా సామాగ్రితో సమయానికి ఒక గంట ముందు చేరుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ గాడ్జెస్ (సెల్‌ఫోన్ ఇతర ఎలక్రానిక్ పరికరాలు) అనుమతించబడవని స్పష్టం చేశారు. ఓ.ఏం.ఆర్. పత్రంలో గడులను నల్ల ఇంకు బాల్ పాయింట్ పెన్నును మాత్రమే ఉపయోగించాలని, ఇతర రంగులతో గడులను నింపితే పరిగణలోకి తీసుకోబడవని చంద్రమోహన్ స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్ష వ్రాయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, పరీక్షల సహాయ సంచాలకులు నీలం లింగం, చీఫ్ సూపెరింటెండెంట్లు, హాల్ సూపరింటెండెట్లు, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.