కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు పొందడానికి జిల్లాలోని గ్రామపంచాయతీలు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ (2023) జిల్లాస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన తొమ్మిది గ్రామపంచాయతీలకు అవార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు వంద శాతం అమలు చేయాలన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గం సభ్యులు అంకితభావంతో పనిచేయాలన్నారు. రెండు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీలను మొదటి కేటగిరి, 2001 నుంచి 5000 వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలను రెండవ కేటగిరిగా, 5001 నుంచి పైన అధికంగా ఎంత జనాభా ఉన్న మూడవ కేటగిరీగా గ్రామపంచాయతీలుగా ప్రభుత్వం అవార్డులు ఎంపికకు గుర్తిస్తుందని తెలిపారు. గ్రామాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుకలో ఉండే విధంగా చూడాలన్నారు.
ప్రతిరోజు గ్రామాల్లో తడి పొడి చెత్త వేరుచేసి సేకరించాలని సూచించారు. సేకరించిన చెత్తను ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు పంపే విధంగా చూడాలన్నారు. డంపింగ్ యార్డ్ లో తయారైన సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి గ్రామపంచాయతీ ఆదాయం పెంచుకోవాలని కోరారు. రాష్ట్రస్థాయిలో జిల్లా గ్రామపంచాయతీలు అధికంగా అవార్డులు పొందాలని చెప్పారు.
జిల్లా స్థాయి అవార్డులు పొందిన గ్రామపంచాయతీల వివరాలు :
శివాయిపల్లి, బస్వాపూర్, పెద్ద మల్లారెడ్డి, వాజిద్ నగర్, బీర్కూర్, అంబారిపేట, దోమకొండ, గర్గుల్, రత్నగిరి పల్లె ఉన్నాయి.
సమావేశంలో డి ఆర్ డి ఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.