నిజామాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించి, వినాయక చతుర్థి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సుభాష్ నగర్ లోని జిల్లా పరిషత్ కూడలి వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు చెరువు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాల వినియోగం ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడిన విగ్రహాల వల్ల అనేక పర్యావరణానికి హాని చేకూరుతుందని, విగ్రహాలను నిమజ్జనం చేసే నీరు కలుషితం అవుతుందని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా మట్టి విగ్రహాలను రూపొందిస్తూ ప్రజలకు పంపిణీ చేస్తుండడం అభినందనీయమని అన్నారు. ప్రజలు కూడా పర్యావరణ హితం కోసం మట్టి గణపతులనే ప్రతిష్టించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ ఆఫీసర్ లక్ష్మణ్ ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, నర్సయ్య, వయోజన విద్యా శాఖ అధికారి ఆనంద్, పొల్యూషన్ బోర్డు కార్యాలయ సిబ్బంది మానస, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.