నిజామాబాద్, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అంటే జైలు గోడలపై బొక్కు ముక్కతో భావావేషాన్ని విస్ఫులింగాలుగా కురిపించిన మహిమాన్విత ప్రదేశమని ఇక్కడ కవిత్వం పరవాలేదు తొక్కడం అత్యంత సహజమని ప్రముఖ కవి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి అన్నారు. ఆయన ఆదివారం నాడు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి ప్రణవి రచించిన పాలకంకులు పుస్తక ఆవిష్కరణ మరియు పరిచయ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కవిత్వంలో అత్యంత సహజంగా రూపక అలంకారాలు ప్రయోగించడం కవి సృజన శక్తికి ప్రతీకగా నిలుస్తుందని ఈ పాలకంకుల పుస్తకంలో ప్రణవి కవిత్వం సజీవంగా వర్తిల్లిందని అభినందించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నిజామాబాద్ జిల్లా కవులు ప్రదర్శించిన చైతన్యం ఆదర్శమని అన్నారు. సమకాలీన కవిత వ్యాసంగంలో ఇందూరు కవులు, కవయిత్రులు ముందున్నారన్నారు. నూతన సాహిత్యకారులను ప్రోత్సహించడంలో హరిదా కృషి అభినందనీయం అన్నారు. కవిత్వం సమాజాన్ని చైతన్య పరుస్తుందని, ఉత్తమ పౌరులను రూపొందిస్తుందని ఆయన వివరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచతుల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ పాలకంకులు పుస్తకావిష్కరణ చారిత్రాత్మక తెలంగాణ జాతీయ సమగ్రతా దినోత్సవం నాడు జరుపుకోవడం సముచితమని అమరులను గుర్తు చేసుకుని స్ఫూర్తిని నింపుకోవడం కనీస బాధ్యత అని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ వి త్రివేణి మాట్లాడుతూ ప్రణవి కవిత్వం ఎవరు చదివితే వారికి తమ అనుభవంగా అనుభూతినిస్తుందని అభినందించారు.
డాక్టర్ కాసర్ల నరేష్ రావు పుస్తక పరిచయం చేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న నరాల సుధాకర్ మాట్లాడుతూ యువత కవిత్వం వైపు నడవడం ఆశావాహ ప్రపంచాన్ని సృష్టిస్తుందన్నారు. కవయిత్రి ప్రణవి మాట్లాడుతూ నిజామాబాదులో యువతరాన్ని సాహిత్యంలో ప్రోత్సహిస్తున్న హరిదా రచయితల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
తిరుమల శ్రీనివాసార్య, జి నరసింహస్వామి, దారం గంగాధర్, మద్దుకూరి సాయిబాబు, కామినేని రేణుక, అన్యం పద్మజా రెడ్డి, ఎనగందుల లింబాద్రి, కొమిరిశెట్టి నాగరాజు, అందే జీవన్రావు, అనిత శ్రీశైలం, బట్టు శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కవయిత్రి ప్రణవిని, ముఖ్యఅతిథి కాంచనపల్లిని ఘనంగా సన్మానించారు.