ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు హాజరైన జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయులకు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

1948, సెప్టెంబర్‌ 17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు.. 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై ఎండ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దార్శనిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఇలా ఐటీ నుంచి అగ్రికల్చర్‌ వరకూ అన్ని రంగాలలో యావత్‌ భారతావనికే దిక్సూచిగా నిలిచిందని తెలిపారు.

స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి 10 ఏళ్లలోకి అడుగిడిన సందర్భాన్ని ఒక్కసారి తరిచి చూసుకుంటే ఎంతో గర్వంగా ఉందని, ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు పర్యావరణం, ఒకవైపు పల్లె ప్రగతి, మరోవైపు పట్టణ ప్రగతి, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం ఇలా అందరిని కడుపులో పెట్టుకుంటూ సబ్బండవర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

రైతుబంధులాంటి విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకువచ్చిన దళిత బంధు లాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ నాయకత్వం వల్లే సాధ్యమైందని మనందరికీ తెలుసు. ఈ పదేండ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మన విజయాలెన్నో కంటిముందు కనిపిస్తాయి. నేడు కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల విద్యుత్తు సరఫరా, మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, బీసీ గ్రాంట్‌ , డబుల్‌ బెడ్రూం ఇండ్లు, చేప పిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు, ధోబీ ఘాట్ల కు ఉచిత విద్యుత్తు, అన్ని వర్గాలకు గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, మన ఊరు, మనబడి, కేసీఆర్‌ కిట్‌, బస్తీ దవాఖానాలు, పల్లె, పట్టణ ప్రగతి, టీఎస్‌ ఐ పాస్‌, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు.

వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ వంటి వినూత్న పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగం సుసంపన్నమైంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా ఈ తొమ్మిది ఏళ్లలో 26 మెడికల్‌ కాలేజీలను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ కాలేజీలు 33 నర్సింగ్‌ కాలేజీలు పెట్టాలన్న లక్ష్యంకు అతి చేరువలో ఉన్నాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మెడికల్‌, నర్సింగ్‌ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు.

జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో లక్ష జనాభాకు అత్యధిక మెడికల్‌ సీట్లు 22 కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నేడు దేశానికి సరికొత్త దిశా దశను నిర్దేశించుకుందని చెప్పారు. నేడు భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. విద్య, వైద్యరంగాల్లోనూ ముందంజలో ఉన్నదన్నారు.

దాదాపు ఇరవై ఏండ్ల క్రితం ఏర్పడ్డ ఛత్తీస్‌గఢ్‌, జార్కండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల కంటే పదేండ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు సాధించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రగతిపథాన దూసుకుపోతున్నది. సాటిలేని సంక్షేమం.. తిరుగులేని అభివృద్ధి రేటుతో ఎంతో ముందంజలో ఉన్నది. సమర్థ నాయకత్వం, సరైన దార్శనికత, సుస్థిరమైన పరిపాలనతో అన్ని రాష్ట్రాలతోనూ పోటీపడుతున్నది. స్వపరిపాలనలో అన్ని రంగాల్లోనూ పునర్నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల బహుముఖంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని చెప్పారు.

స్వరాష్ట్రంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసినా, అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దినా, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చినా అది కేసీఆర్‌ నాయకత్వం వల్లనే సాధ్యమైందన్నారు. కామారెడ్డి జిల్లాలో చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని, తెలంగాణ సమైక్యత దినోత్సవం సాక్షిగా జాతీయ సమైక్యత సమగ్రతను చాటేలా యావత్‌ భారతావనికే తెలంగాణను కామారెడ్డి జిల్లాను దిక్సూచిగా నిలపాలని కోరారు.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన …

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల చిన్నారులు దేశభక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఈ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శోభ, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు సురేందర్‌, హనుమత్‌ షిండే, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్రమోహన్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »