గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని అన్నారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, నివేశన స్థలాల అందజేత తదితర అంశాలపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు.

గృహలక్ష్మి పథకం కింద అర్హులైన వారిని గుర్తించి, సత్వరమే మంజూరీ పత్రాలను పంపిణీ చేయాలని అన్నారు. రెండు వారాలలో ఆయా జిల్లాలకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మంజూరీలు తెలుపాలని గడువు విధించారు. ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలో గృహలక్ష్మి పథకం కింద 16500 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని లక్ష్యం కాగా, 3930 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధమయ్యిందని సి.ఎస్‌ దృష్టికి తెచ్చారు.

గురువారం నుండి మంజూరీ పత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామని, వారం రోజుల్లో జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు. కాగా, ఆసరా పెన్షన్లకు సంబంధించి మృతి చెందిన లబ్ధిదారుల స్థానంలో వారి జీవిత భాగస్వామికి పెన్షన్‌ బదలాయింపు ప్రక్రియలో జాప్యానికి తావు లేకుండా చూడాలని సి.ఎస్‌ కలెక్టర్లకు సూచించారు. పంట రుణాల మాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేలా చూడాలని, బ్యాంకర్లతో ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షించాలని మార్గనిర్దేశం చేశారు.

రుణమాఫీ ద్వారా రైతుకు లబ్ది చేకూరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చొరవ చూపాలని, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరిపించాలని హితవు పలికారు. ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరుపుతూ, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా సరిపడా ఎరువుల నిల్వలను ముందుగానే సమకూర్చుకోవాలని, రిటైల్‌ మార్కెట్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేస్తూ, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించాలని అన్నారు. జీ.ఓ 58 , 59 కింద భూముల క్రమబద్ధీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. హరితహారం కింద నూటికి నూరు శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, డీ.ఎఫ్‌.ఓ వికాస్‌ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌, డీ.ఆర్‌.డీ.ఓ చందర్‌, డీపీవో జయసుధ, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు భావన, శంకర్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »