ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అలవికాని వాగ్దానాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేసి చూపిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని బుధవారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అట్టహాసపంగా ప్రారంభించారు.

లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పొంగించారు. నూతన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకే సముదాయంలో అన్ని వసతులతో 96 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించగా, వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2బీహెచ్‌ కె సముదాయానికి కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. 2బీహెచ్‌ కె నిర్మాణాల కోసం రూ. రూ. 6.29 కోట్లు వెచ్చించామని, అన్ని వసతులతో కాలనీ సుందరంగా రూపొందిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ప్రాంగణంలో అందుబాటులో ఉన్న స్థలంలో త్వరలోనే మరో 32 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కట్టించి రెండవ విడతగా అర్హులకు అందిస్తామని ప్రకటించారు. సొంత జాగా కలిగి ఉన్న మరో 62 మందికి గృహలక్ష్మి పథకం కింద రూ. మూడు లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామని అన్నారు.

ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల సాకారం చేస్తామని భరోసా కల్పించారు. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో పేదవారికే ప్రాధాన్యత తప్ప, పైరవీలకు ఏమాత్రం అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మలివిడత ఉద్యమం సందర్భంగా ఎంతో బలవంతులైన తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని ఉద్యమనేత కేసిఆర్‌ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షతో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు.

ఇచ్చిన హామీకి కట్టుబడి కొంత ఆలస్యమైనప్పటికీ అన్ని వసతులతో కూడిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిరుపేదలకు అందిస్తున్నామని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏమాత్రం వెరవకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ నిర్మాణాలే ఇందుకు నిదర్శనం అని మంత్రి ఉదహరించారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, బీడీ కార్మికులకు పెన్షన్‌ వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అద్దం పడుతున్నాయని అన్నారు.

రైతు బంధు పథకం కింద రూ. 73 వేలు కోట్ల నిధులను, రైతు రుణమాఫీ కింద రూ. 36 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఒక్క పడగల్‌ గ్రామంలోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం 71 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని వివరించారు. గ్రామంలోని 1090 మంది లబ్దిదారులకు ఆసరా పథకం కింద 16.19 కోట్ల రూపాయల పెన్షన్లు, కల్యాణలక్ష్మి పథకం ద్వారా 187 మందికి కోటీ 76 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 152 మందికి 74.85 లక్షలు, రైతు బంధు కింద 10.46 కోట్ల రూపాయలను అందించండం జరిగిందని వివరించారు.

ఇంకనూ ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే, వారికి కూడా తరతమ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల ద్వారా తప్పనిసరిగా లబ్ది చేకూరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పడగల్‌ గ్రామంలో సి.సి, బీ.టీ రోడ్లు, బైపాస్‌ రోడ్డు, డ్రైనేజీలు, గ్రామాభివృద్ధి కమిటీకి షాపింగ్‌ కాంప్లెక్స్‌, యువత ఆరోగ్య పరిరక్షణకై ఓపెన్‌ జిమ్‌, వివిధ కులాల వారికి సంఘ భవనాలు నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి, అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలువాలని కోరారు.

కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, ఆర్మూర్‌ ఆర్డీఓ వినోద్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌.ఈ రాజేశ్వర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ వర్షిణి రాజ్‌ కుమార్‌, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »