బాన్సువాడ, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య బేరి,అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనానికి కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి కల్పన దేవసాని ప్రత్యేక అతిధిగా తాన సంస్థ ఆహ్వానించినట్లు వారు తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ అనేక రచనలు,కవితలు, గేయాలు నవలలు రచించి రచయిత్రి, గాయనిగా ప్రఖ్యాతి పొంది, తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సామాజిక సేవలో ప్రధాన భూమిక పోషిస్తూ కావ్య లహరి అనే సంస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నారు.
ఈ సందర్భంగా కల్పనా దేవసాని మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో కవిత్వ వినిపించడానికి తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించిన తాన అధ్యక్షులు నిరంజన్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్, సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే సాహిత్య సమ్మేళనంలో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయితలు పాల్గొంటున్న కార్యక్రమానికి పదికి పైగా మాధ్యమాల్లో ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
అలాగే ఇటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఎంపిక చేసినందుకు కల్పన హర్షం వ్యక్తం చేశారు. కల్పన దేవసానికి అంతర్జాతీయ గుర్తింపు పట్ల జిల్లాలోని పలువురు రచయితలు, కవులు సాహితివేత్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి అధ్యాపకులు ఆమెకు అభినందనలు తెలిపారు.