బాన్సువాడ, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు 20 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సత్తా తెలియజేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న అన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సింహ గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
మున్నూరు కాపు సంఘ నాయకులు కులస్తులు బిచ్కుందలో పాదయాత్ర చేసి బండయ్యప్ప ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని మున్నూరు కాపుల సత్తా రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల పోటీ చేసే మున్నూరు కాపు అభ్యర్థులకు కులస్తులు మద్దతు పలికి వారి గెలుపుకు కృషి చేయాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం మున్నూరు కాపు ఫెడరేషన్ 5 వేల కోట్లతో ఏర్పాటు చేసి, ఈడబ్ల్యూఎస్ ప్రకారం మున్నూరు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని, మున్నూరు కాపులకు పేరు చివరన పటేల్ అని గెజిట్ ప్రభుత్వం ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్నూరు కాపు విద్యార్థులు ఉన్నత చదువులు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వమే స్కాలర్షిప్ సదుపాయం కల్పించాలని ఆయన అన్నారు. ఏరువాక పౌర్ణమి పండుగను ప్రభుత్వ పండుగ గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాష్ట్ర నాయకులు విట్టల్, గాలి అనిల్ కుమార్, కాసుల బాలరాజ్,ఉగ్గే శ్రీనివాస్, జడ్పిటిసి రాజు, డాక్టర్ బండి విజయ్, పాకాల విజయ్, సానేపు గంగారం, గాయకురాలు గంగ, ఆవారి గంగారం, అరిగే పోశెట్టి, కాసుల రోహిత్ జిల్లాలోని మున్నూరు కాపు సంఘ నాయకులు కులస్తులు పాల్గొన్నారు.