వేల్పూర్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి వేముల ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి సరఫరాపై గట్టి నిఘా పెంచారు. అందులో భాగంగా కమ్మర్‌పల్లి, ముప్కాల్, మెండోర పి.ఎస్ పరిధిలో ఆర్మూర్ ఎసిపి జగదీష్ చందర్, భీంగల్ సిఐ వేంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సి.ఐ గోవర్దన్ రెడ్డి ఆయా పి.ఎస్ పరిధి ఎస్.ఐల అధ్వర్యంలో గంజాయి సరాఫరా చేస్తున్న ఆరుగురిని రెడ్ హ్యాండడ్‌గా వలపన్ని పట్టుకున్నారు.
ఈ సందర్బంగా చాక చక్యంగా వ్యవహరించి గంజాయి సప్లయ్ చేసేవారిని పట్టుకున్న పోలీసులను మంత్రి వేముల అభినందించారు. జిల్లాకు కొత్త సి.పి సత్యనారాయణ వచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగం మరింత దూకుడు పెంచారని కొనియాడారు. గంజాయి నిర్మూలన విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, ఎంతటి వారినైనా సరే వదిలే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.
మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసేలా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రి హర్షం వెలిబుచ్చారు. ఇక ముందు ఇలాగే స్వేచ్చగా మీ పని మీరు చేసుకుపోండని మంత్రి వారికి భరోసా చెప్పారు.