కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులపై వివక్ష చూపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పై దివ్యాంగుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులను గౌరవించే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు.
అర్హత గల వారందరికీ దివ్యాంగుల పింఛన్లు ఇప్పిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలలో దివ్యాంగులకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు పై దివ్యాంగుల కమిటీ సభ్యులు దివ్యాంగులకు అవగాహన కల్పించాలని కోరారు. మీసేవ, ఆన్లైన్లో దివ్యాంగులకు ఎదురయ్యే సమస్యలను త్వరిత గతిన పరిష్కారం చేయాలని సూచించారు.
పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పరికరాలు అందేలా చూడాలని కమిటి ప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, కమిటీ ప్రతినిధులు పోచవ్వ, సాయిలు, రాజమౌళి, నాగరాజు, బాలయ్య, మంజుల పాల్గొన్నారు.