కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయోవృద్ధుల పోషణ చేయని వారి (పిల్లలు) వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా వయోవృద్ధుల కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణను వారి కుటుంబ సభ్యులు చూడకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వృద్ధులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రక్త పరీక్షలు చేయించుకోవాలని, వీటిని పూర్తిగా ఉచితంగా చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వయోవృద్ధులు వినియోగించుకోవాలని సూచించారు. వృద్ధులను వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడితే జిల్లా సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులకు తెలియజేయాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను పోషణ చేయకపోతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై సలహాలు,సూచనలు అందించాలని కోరారు. వయో వృద్ధులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ సాయన్న, జిల్లా మహిళా, శిశు దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బావయ్య, ప్రతినిధులు రాజేశ్వరరావు, బైరయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.