రెంజల్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రెంజల్ మండల మహిళా సమాఖ్యలో హార్వెస్టర్ నిర్వాణలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరా కాంతి పథం కార్యాలయంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లసింగారి లక్ష్మీ అధ్యక్షతన 17వ మహాజన సభ జరిగింది. సభా ప్రారంభంలో మరణించిన ఐకెపి సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఏడాది పాటు జరిగిన కార్యాలయ జమ, ఖర్చులను అకౌంటెంట్ శారద చదివి వినిపించారు. హార్వెస్టర్ నిర్వహణ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటంపై స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్లషికారి రమేష్ కుమార్, ఎంపీపీ రజని, జడ్పిటిసి విజయ అసహనం వ్యక్తం చేశారు. ఆదాయం రానిది హార్వెస్టర్ నడపడం ఎందుకని నిలదీశారు. హార్వెస్టర్ నిర్వాహన బాధ్యత సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించరాదని మహాజన సభ తీర్మానించింది.
మండల కేంద్రంలోని వనిత వివోలోని వరలక్ష్మి మహిళా సంఘంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రమేష్ కుమార్ సభను సూచించారు.జరిగిన అవకతవకలపై సమావేశాన్ని నిర్వహించి మహిళల సమక్షంలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వివోఏ నవ్య పనితీరుపై చర్యలు తీసుకోవాలని సభను కోరారు.ఎంపీడీవో శంకర్, సూపర్డెంట్ శ్రీనివాస్, ఇన్చార్జి ఏపిఎం భాస్కర్, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుజాత, సీసీలు కృష్ణ, రాజయ్య, శివకుమార్, సునీత, మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారు.