నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సభ్యులు దాసరి రంజిత్ తదితర సభ్యులు పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడంతోపాటు వారి యొక్క మానసిక బలాన్ని పెంపొందించడం, శ్రద్ధను, నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తు, ప్రోత్సహిస్తున్నారని రఘురాజ్ అన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులలో నిగూఢమైన శక్తిని వెలికి తీయడంలో నూతన ఉత్సాహాన్ని, ప్రేరణ, కలిగించడంలో, విద్యార్థులలో ఉత్తేజాన్ని, ఆనందాన్ని పెంపొందించడంలో ఎంతో కృషి చేస్తున్నారని వారి కృషి అభనందనీయం అన్నారు. బాలికల కళాశాల ప్రిన్సిపల్ నుసరత్ జహాన్ మాట్లాడుతూ ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు.
బాలికల కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉందని అన్నారు. ఇన్స్పైర్ ఇగ్నైట్ సభ్యులు దాసరి రంజిత్, అనీష్, సుధాకర్, నరహరిలు మాట్లాడుతూ విద్యార్థినిలలో సృజనాత్మకత, భావ వ్యక్తీకరన, నైపుణ్యము పెంపుదల, తల్లిదండ్రులు, అధ్యాపకుల పైన గౌరవము, సమాజంలో విలువలు, అవాంఛనీయ సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి, సమాజంలో ఎలా జీవించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులలో జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే విధంగా వారి యొక్క జీవనశైలిని మార్చుకునేందుకు మంచి భవిష్యత్తును నిర్మించుకునేందుకు సూచనలు సలహాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.