నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మరింత మెరుగైన పరిపాలన, సత్వర అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లాలోని ‘రామడుగు’ గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు.
ధర్పల్లి మండలంలో కొనసాగుతున్న రామడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ, దీని పరిధిలో డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, సుద్దులం, ధర్పల్లి మండలంలోని రామడుగు, మైలారం, కేసారం, చల్లగర్గే, కోనేపల్లి (7 గ్రామాలను ) చేరుస్తూ కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిందన్నారు.
నూతనంగా ఏర్పాటు కానున్న రామడుగు మండలం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతుందని తెలిపారు. కొత్త మండలం ఏర్పాటు ప్రతిపాదనపై సంబంధిత ప్రాంతాల ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, పక్షం రోజుల్లోపు లిఖితపూర్వకంగా తమకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.