నందిపేట్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలో ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిపేట్ పట్టణంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా బారాస అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రత్యేకంగా మంజూరు చేయించిన 12 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఫోర్ లైన్ సెంట్రల్ లైటింగ్, డివైడర్ గార్డెనింగ్ పనులు కొనసాగుతున్నాయి.
రోడ్డు వెడల్పు పనులు పూర్తి అయిన తర్వాత సెంట్రల్ లైటింగ్‌తో నందిపేట్ పట్టణం వెలిగి పోతదని బీఆర్‌ఎస్ నాయకులు చెప్తున్నారు. నందిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి కాలనిలో ఐదున్నర కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మితమవుతున్నాయి. ఎటు చూసినా గుంతల మయంగా ఉన్న కాలనిలో ఇప్పటి నూతన పాలక వర్గం ఎన్నికైన వెంటనే గ్రామం అంత మొరం పోసి అందంగా తయారు చేశారు.
అట్టి మొరం రోడ్లపై సిసి రోడ్లు వేస్తుండడంతో గ్రామానికి మరింత కళ వస్తున్నది. మూడున్నర కోట్లతో ప్రభుత్వ విద్యా సంస్థల ఆధునీకరణ జరుగుతున్నది. 15 కోట్ల రూపాయలతో 30 కుల సంఘాలు, 12 కోట్ల రూపాయలతో వివిధ కులాల మండల స్థాయి ఫంక్షన్ హాల్‌లు నిర్మితమవుతున్నాయని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తెలిపారు. గత 60 ఏళ్లలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి చేస్తున్న జీవన్ రెడ్డిని 60 వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నందిపేట్ మండల కేంద్రంలో గల వివేకానంద చౌరస్తా నుండి నంది గుడి వరకు మెయిన్ రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో అధికారులు చక చక పనులు జరుపుతున్నారు. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో 100 ఫీట్ల వెడల్పుతో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులను స్థానికులు సహకరించి తమ ఇళ్ళ ముందు రోడ్డు వరకు నిర్మించిన షెడ్లను మెట్లను స్వచ్ఛందంగా తామే తొలగించి రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం కలుగకుండ సహకరించడం విశేషం.