కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత శాసనసభ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు, మద్యం అమ్మకాల వివరాలు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు రేపటిలోగా అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌లతో కలిసి కమిటీ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటకు గత ఎన్నికలలో జరిగిన అనుభవాలను మననం చేసుకొని వాటిని అధిగమించుటకు తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
అందులో భాగంగా సమాన ప్రక్రియ పద్ధతి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) న గత ఎన్నికలల్లో నియోజక వర్గంలో విచ్చలవిడిగా ధన వ్యయం చేసిన వివరాలను సెక్టార్ వారీగా, పోలింగ్ బూతుల వారీగా సమగ్ర నివేదిక అందించాలన్నారు. అదేవిధంగా గత ఎన్నికలల్లో నేరాలకు పాల్పడి రిజిస్టర్ చేసిన కేసుల వివరాలు, కుల, మత సంఘర్షణలు తదితర సంబంధించిన కేసుల వివరాలు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వివరాలు అందజేయవలసినదిగా కోరారు.
ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, కేసులు నమోదు చేసిన వివరాలు, మాదక ద్రవ్యాల నిరోధక క్రింద నమోదు చేసిన కేసుల వివరాలు, తరచుగ నేరాలకు పాల్పడే వారి వివరాలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా ఆబ్కారీ అధికారి రవీంద్ర రాజు, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ భార్గవ్, ఎస్.బి. సి.ఐ. చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.