బాన్సువాడ, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోస్ర మండల కేంద్రంలో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నేసాబ్, కరుణా దేవి మాట్లాడుతూ అంగన్ వాడీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటని, ఆమె మాటలను వెనక్కి తీసుకొని ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై ప్రభుత్వం చులకనగా చూడడం తగదని, మహిళా ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా బహిరంగంగా బెదిరించి, మహిళా సమాజాన్ని మంత్రి అవమానపరిచారని మండిపడ్డారు.
ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని, లేకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సుప్రియ, ఎలిజబెత్ రాణి, మీనా, శ్రీలత, పద్మ, సత్తు బాయి, జయశ్రీ, బాలమణి, రూప, కళావతి, అంగన్వాడి ఉద్యోగులు, ఆయా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.