నిజామాబాద్, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సూచించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలియజేస్తూ రూపొందించిన హ్యాండ్ బుక్ ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నెలకొని ఉన్న పరిస్థితులను ముందుగానే గమనిస్తూ, ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తేవాలని సెక్టోరల్ అధికారులకు సూచించారు.
ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. తాజా స్థితిగతులలో పాటు, గత ఎన్నికల్లో చోటుచేసుకున్న సంఘటనలు, వివిధ అంశాల ప్రాతిపదికన సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వచ్చే నెల అక్టోబర్ 07 తేదీ లోపు పూర్తి వివరాలతో ప్రాథమిక నివేదికను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మీదట మూడు రోజుల్లోపు తుది నివేదికను అందించాల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా నిలువరించే వారిని, అలాగే ఓటర్లను ప్రభావితం చేసే వారిపై నిఘా పెట్టి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. అలాంటి పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక జాబితాలో చేరిస్తే, పోలీసుల సహాయంతో జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నందున, కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను సందర్శిస్తూ, స్థానికులతో క్రమం తప్పకుండా భేటీలు నిర్వహించడం ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవచ్చని సూచించారు. కీలకమైన ఎన్నికల నిర్వహణ విధుల్లో నిమగ్నమై ఉన్నందున అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోకూడదని, ఒకవేళ సెలవుపై వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా గట్టి పోలీస్ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బంది, సాయుధ బలగాలను మోహరిస్తామని అన్నారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజా, ఆర్డీఓలు, ఏ.ఆర్.ఈ.ఓలు, సెక్టోరల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సరిహద్దు ప్రాంతాలలో ఉమ్మడి తనిఖీలు
ఎన్నికల సందర్భంగా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలలో ఉమ్మడి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. పోలీస్ కమిషనర్ తో కలిసి సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులతో వీడేమో కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దులతో పాటు, అంతర్ జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి పోలీస్, ఎక్సయిజ్, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు జరపాలని నిర్ణయించారు.
ఏయే ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించి ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే గత 2018 ఎన్నికలు మొదలుకుని ఇప్పటివరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పట్టుబడ్డ అక్రమ మద్యం, నగదు, గంజాయి వంటి మత్తు పదార్థాలు తదితర వాటి వివరాల ఆధారంగా అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.