కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కలిగించారు.
ప్రతి ఓటు కీలకమైనదని, ఒక్క ఓటు గెలుపు ఓటములు నిర్ణయించే వీలుందని అన్నారు. సుస్థిరమైన ప్రజాస్వామ్య నిర్మాణం ఓటరు చేతిలో ఉందని, ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా తమ ఓటు హక్కు నియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఈవీఎం, వివిప్యాట్ ల ద్వారా ఓటు వేసే విధానం పై విద్యార్థులచే మాక్ పోలింగ్ నిర్వహించి అవగాహన కలిగించారు. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా నేడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎవరెస్టు శిఖరం అధిరోహిత మాలవత్ పూర్ణ ఓటు అనేది మన హక్కని, భాద్యతగా గుర్తించి ఓటు హక్కు వినియోగించాలని సూచించారు. ఓటు వజ్రాయుధం లాంటిందని, ఎలాంటీ ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛదంగా ఓటు వేయాలని హితవు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన నాటిక ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రధానాచార్యులు కిష్టయ్య, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.