బాల్కొండ, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలంలో ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 6.4 కోట్ల వ్యయంగల పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్లతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. బాల్కొండ మండల కేంద్రంలో మండల ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం అదనపు గది నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో (10.4 లక్షలు) పాల్గొన్నారు.
తర్వాత బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వన్నెల్ బి నుండి ధర్మోరా బిటి రోడ్ రిన్వల్ శంకుస్థాపన 1.50 కోట్ల వ్యయం, బాల్కొండ ఎన్‌హెచ్ 16 నుండి పడగల్ వరకు వయా వన్నెల్ బి బిటి రోడ్ రిన్వల్ పనుల శంకుస్థాపన 2.50 కోట్ల వ్యయంతో, వన్నెల్ బి పడగల్ గ్రామాల మధ్య స్లాబ్ కల్వర్టు నిర్మాణం 40 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు.
సిఎం కేసిఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు పెడుతుందని మంత్రి వేముల తెలిపారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ది 9 ఏళ్లలో చేసి చూపించామని అన్నారు. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది చేశామని అన్నారు. కోటి రూపాయలకు తగ్గకుండా ప్రతి గ్రామంలో సి.సి రోడ్లు వేశామని చెప్పారు. వేల కోట్ల నిధులతో బాల్కొండ నియోజకవర్గ అభివృద్ది పనుల పరంపర కొనసాగుతున్నదని, కేసిఆర్ వల్లే ఈ అభివృద్ది సాధ్యమైందని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.
మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.