కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రశంస పత్రాలు అందజేశారు.
కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007లో ప్రారంభించడం జరిగిందని నాడు 78 మందితో ప్రారంభించిన సమూహం నేడు 3వేల పైగా రక్తదాతలతో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి రక్తదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 16 వేలకు పైగా యూనిట్ల రక్తం అందజేయడం జరిగిందని, తలసేమియా వేదముతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆరు నెలల కాలంలోనే 1200 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహం గత 15 సంవత్సరాలుగా చేస్తున్న రక్తదాన సేవలను, కరోనా సమయంలో ప్లాస్మాదానం, రక్తదానంపైన అవగాహన సదస్సులను నిర్వహించడం ఎంతో అభినందనీయమని వీరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ బాలు, అధ్యక్షులు డాక్టర్ వేదప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్, కిరణ్, సలహాదారులు రమణ, సాయి, శ్రీధర్, రక్తదాతలు పాల్గొన్నారు.