కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు.
ఓటరు నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, తుది ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, భద్రతాపరమైన ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షిస్తూ, జిల్లా ఎన్నికల అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఓటరు నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి, ఈ నెల 27 వ తేదీలోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని గడువు విధించారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన సిబ్బంది నుండి తక్షణమే వివరాలు తెప్పించుకుని, ఏ ఒక్క దరఖాస్తు సైతం పెండిరగ్లో ఉండకుండా అన్నింటిని గడువు తేదీ లోపు అప్లోడ్ చేయాలని సూచించారు.
ఓటరు నమోదు, మార్పులు,చేర్పులు,తొలగింపులకు వచ్చిన వివిధ దరఖాస్తులను ఎలక్షన్ కమీషన్ మార్గదర్శకాలకు లోబడి పరిష్కరించుటకు అని చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెల 27 లోపు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, అదనపు ఎస్పీ నరసింహ రెడ్డిలతో కలిసి కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన జిల్లా కలెక్టర్ సమావేశానంతరం ఈ.ఆర్.ఓ.లు, ఎన్నికల నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండవ ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలోగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలని, వీటిపై ఈ.ఆర్.ఓ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
అనంతరం ఓటరు ఎపిక్ కార్డులను ముద్రించి పంపిణి చేయాలన్నారు. వంద శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ర్యాంప్, వీల్ చైర్, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం ఉన్నాయా మరోమారు పరిశీలించి నిర్దేశిత సమయంలో నివేదిక సమర్పించాలని అన్నారు. జిల్లాలో యువత, దివ్యాంగులు మహిళల కోసం ప్రత్యేక మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు ఉండేలా గ్రామ కార్యదర్శులు చూడాలన్నారు. నోడల్ అధికారులు తమ సబ్జెక్ట్ కు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గత శాసనసభ ఎన్నికల నిర్వహణ తీరును, ఫైళ్లను పరిశీలించి, జరగబోయే ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు రోజు వారి కార్యక్రమం షెడ్యూల్ రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు.
సెక్టోరల్ అధికారులు, ప్రిసైడిరగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తదితరులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, కావలసిన మెటీరియల్ ఏమిటో క్షుణ్ణంగా పరిశిలించి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెబ్ కాస్టింగ్ చేపట్టాలన్నారు. తక్కువ ఓటు శారం నమోదవుతున్నా కేంద్రాలపై దృష్టి పెట్టాలన్నారు.
ఎన్నికల నిమిత్తం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు ఒకసారి పరిశీలించి ధ్రువీకరించుకోవాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుపై తుది ప్రతిపాదనలు క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. కాల్ సెంటర్ లో వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈవీఎం లు, సిబ్బంది తరలింపునకు, రూట్ అధికారులకు, ఎన్నికల పరిశీలకులకు వాహనాలు సమీకరించాలని ఆర్.టి.ఓ. కు సూచించారు. మ్యాన్ పవర్ (మానవ వనరులు) సిద్ధం చేయవలసినదిగా సిపిఒకు, సరిహద్దు ప్రాంతాలలో మద్యం,గంజాయి, డబ్బు అక్రమ కాకుండా పొలిసు, ఆబ్కారీ, అటవీ శాఖలు గట్టి నిఘా పెట్టాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, భుజంగం, స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆర్.టి.ఓ. దేవయాని, డీఈఓ రాజు, డిపిఓ శ్రీనివాస్, కార్మిక శాఖ సహాయ కమీషనర్ సురేందర్, పరిశ్రమల శాఖా సహాయ సంచాలకులు రఘునందన్ ఎన్నిక విభాగం పర్యవేక్షకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.