కామారెడ్డి, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం సమీపంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్ర మోహన్ మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
అందులో భాగంగాచాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుందని, వేడుకల నిర్వహణ వలన వారు చేసిన త్యాగాలు, సేవలు స్మరించుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు రాజయ్య, సంగయ్య, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.