నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసి స్ఫూర్తిదాతగా నిలిచారని. అణగారిన వర్గాల్లో పోరాట స్ఫూర్తి రగిలించిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు నేటి తరం వారు కలిసికట్టుగా కృషిచేయాలని సూచించారు.
మహనీయుల గురించి తెలుసుకుని, వారు సూచించిన బాటలో పయనించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్, నర్సయ్య, నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పీ నారాయణ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, బీ.సీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.