నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్ లో మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కమిటీ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా, అదనపు కలెక్టర్ వాటిపై సానుకూలంగా స్పందించారు. దివ్యంగుల కోసం ఉద్దేశించిన చట్టాలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యంగుల హక్కులు, వారికి వర్తించే సదుపాయాలను తెలియజేసేలా తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలని, ర్యాంపులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దివ్యంగుల హక్కుల గురించి తెలియపర్చేలా విరివిగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఐదు శాతం మంది దివ్యంగులకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులోనూ తప్పనిసరిగా 5 శాతం దివ్యంగులకు కేటాయించేలా చూస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. దివ్యంగులకు అందించిన బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ళు చాలా వరకు చెడిపోయాయని కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ దృష్టికి తేగా, తక్షణమే వాటికి మరమ్మతులు చేయించి దివ్యంగులకు వెసులుబాటు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దివ్యంగులకు పెన్షన్లు పంపిణీ చేసే సమయంలోనూ తగిన వసతులు కల్పించాలని, అవసరమైన చోట అధికారులే కార్యాలయ ప్రాంగణాల్లో వారి వద్దకు వచ్చి పెన్షన్లు అందించాలని సూచించారు. వైకల్యంతో బాధుపడుతున్న వారికి అవసరమైన నిర్ధారణ పరీక్షలు జరిపించి ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాలో ప్రతీ నెల రెండు పర్యాయాలు ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ దివ్యంగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దివ్యంగుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన సంరక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బీ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.