కామారెడ్డి, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటలకు అనువుగా ఉన్నందున ఆ దిశగా రైతులను ప్రోత్సహించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యవసాయ విస్తరణాధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ఆయిల్ ఫామ్ పరిశ్రమలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం 5 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలు పండిరచాలని లక్ష్యమని, ప్రతి వ్యవసాయ విస్తరణాధికారి తమక్లస్టర్ పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కనీసం 50 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలు పండిరచేలా ప్రస్తుతం ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేస్తున్న రైతులతో పాటు అభ్యుదయ రైతులు, పెద్ద రైతులు, పొటెన్షియల్ రైతులను ప్రోత్సహించి పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
ఆయిల్ ఫామ్ పంట వేసిన నాలుగు సంవత్సరాల తరువాత 25-30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం వస్తుందని అన్నారు. నాలుగు సంవత్సరాలు అంతర పంటలుగా పత్తి, వేరుశనగ మొక్కజొన్న, బొప్పాయి, అరటి మరియు కూరగాయలు వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చని, ఇందుకోసం ప్రభుత్వం సంవత్సరానికి 4200 చొప్పున నాలుగేండ్లు సబ్సిడీ ఇస్తుందని అన్నారు.
అదేవిధంగా బిందు సేద్యానికి 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఒక ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3-4 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన శిక్షణ,సాంకేతిక సలహాలు అందిస్తామని, ఎకరాకు 30 వేల ఖర్చయితే సుమారు లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులకు అవగాహన కలిగిస్తూ ఆయిల్ ఫామ్ పంటల వైపు మొగ్గు చూపేలా చూడాలని సూచించారు.
సమావేశంలో ఉద్యాన శాఖ జనరల్ మేనేజర్ మల్లేశ్వర రావు, జిల్లా ఉద్యాన అధికారి విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.