నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. జిల్లా పరిషత్ ఛైర్మెన్ దాదన్నగారి విఠల్ రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ ఆకుల లలిత, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడతాయనే భావనతో తన తుది శ్వాస వరకు కూడా ప్రత్యేక రాష్ట్ర సాధనకై అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు.
ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, తెలంగాణ సమాజంలో జన్మించిన ఆణిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ అని అభివర్ణించారు. ఆయన త్యాగాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు ఐకమత్యంతో పాటుపడాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్, పద్మశాలి, బీసీ కుల సంఘాల నాయకులు నరాల సుధాకర్, వెంకట నర్సయ్య, పులగం హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.