కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటి పన్నులు ఈ నెల 30లోగా వందశాతం వసూలు చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల స్థాయి పంచాయతీ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోని పోలింగ్ బూతుల్లో ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు, వీల్ చైర్ ఏర్పాటు చేయాలని కోరారు. 2019 పల్లె ప్రగతి తర్వాత గ్రామపంచాయతీలలో తాగునీటి, వీధిలైట్ల విద్యుత్ బిల్లులను చెల్లించే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో అవసరం లేని చోట విద్యుత్ మీటర్లను తొలగించాలన్నారు.
వాటి వివరాలను ఎంపీవో లు లేఖ ద్వారా ఎఈ కి సమాచారం తెలుపాలన్నారు. గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లో విద్యుత్ బకాయిలు అధికంగా ఉన్నాయని తెలిపారు. దశలవారీగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. సమావేశంలో డిపిఓ శ్రీనివాసరావు, డి ఎల్ పిలు సురేందర్, శ్రీనివాస్, ఎంపీవోలు పాల్గొన్నారు.