నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కలిగి ఉండేలా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్.చోంగ్తు సూచించారు.
పోలింగ్ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు. బుధవారం ఆమె కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని జక్రాన్పల్లి మండలం పడ్కల్, అర్బన్ సెగ్మెంట్ లోని అర్సపల్లి, ఆర్మూర్ సెగ్మెంట్లోని మాక్లూర్ మండలం గుత్ప, బాల్కొండ సెగ్మెంట్లోని పోచంపాడ్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని శక్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు, మార్పులు-చేర్పులు కోరుతూ దాఖలైన దరఖాస్తులను పరిశీలించి, వాటి వివరాలను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేసిన తీరును నిశితంగా పరిశీలన జరిపారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు తదితర వివరాలను బీ.ఎల్.ఓలకు అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి కొత్తగా వలస వచ్చిన వారికి సంబంధించి కొత్త ఓటరుగా పేరు నమోదు చేసే ముందు తప్పనిసరిగా వారి పాత నివాస ప్రాంతంలో ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.
డూప్లికేషన్ ఓటర్లకు సంబంధించి కూడా రెండు చోట్ల నిర్ధారణ చేసుకుని, ఏదైనా ఒక ప్రాంతంలో తప్పక ఓటరు పేరు ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన వారి గురించి సంబంధిత పోలింగ్ కేంద్రం అధికారులకు తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాలో పలువురి ఫోటోలు లేకపోవడాన్ని గమనించిన పరిశీలకులు క్రిస్టినా, ఇంకను సమయం ఉన్నందున సదరు ఓటర్ల ఫోటోలు సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు.
మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ముందు కుటుంబ సభ్యుల ద్వారా నిర్ధారణ చేసుకోవాలని, మరణ ధ్రువీకరణ పత్రం లేకపోయినా సంబంధిత మున్సిపల్, గ్రామ పంచాయతీ నుండి సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించిన నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఏ విషయంలోనైనా అనుమానాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లకు ఆస్కారం కల్పించకూడదని సూచించారు. అబ్జర్వర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.