అరెస్టు చేసి విచారణ కాలంలో సుదీర్ఘకాలం జైలులో ఉంచడం కచ్చితంగా హక్కుల ఉల్లఘన అవుతుంది. గతంలో జగన్ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ రాజకీయ నాయకుల అవినీతిని సమర్థించలేం. అవినీతికి పాల్పడిన వ్యక్తుల పట్ల ఉదాసీనతని సహించలేం. చట్టపరిధిలో కేసులు నమోదు చేసి నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అయితే అవినీతి కేసులు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి అవినీతిపరులకు శిక్ష పడేలా సాక్షాల సేకరించి న్యాయస్థానాల ముందు ఉంచాలి.
విచారణ సమయంలో నిందితులను జైల్లో ఉంచాలన్న భావన సరికాదు ఇది వ్యవస్థల దుర్వినియోగానికి కచ్చితంగా దారితీస్తుంది. పోలీస్ అధికారి ఎవరిమీదైనా తప్పుడు కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపి రోజుల తరబడి వారిని జైల్లో మగ్గేలా చేయడానికి ఆస్కారం ఇస్తుంది.
కస్టడీ ఓ ప్రహసనం
విచారణలో భాగంగా అరెస్ట్ అనంతరం పోలీస్ కస్టడీ కోరడం ఓ తంతుగా మారింది, ముద్దాయికి మాత్రమే తెలిసిన సమాచారం రాబట్టడం కోసమో.. తిన్న సొమ్ము తిరిగి రాబట్టడానికి కస్టడీ అడిగితే దానికి ఓ అర్థం ఉంది. అయితే నేర విచారణలో సాక్షాలు సేకరించాల్సిన పూర్తి బాధ్యత విచారణ సంస్థలదే. సాక్షాల సేకరణ కోసం నిందితులను కస్టడీ కోరడం వల్ల ప్రయోజనం ఏమంటున్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
నేర ప్రక్రియకు సంబంధించి నిందితులు పోలీసులకు ఏమి చెప్పినా అది చెల్లుబాటు కాదని భారత సాక్ష్య చట్టం చెబుతుంది. పోలీసుల ముందు నిందితుడు నేరం అంగీకరించినా దాన్ని కోర్టులు క పరిగణలోకి తీసుకోవు. విచారణ సమయంలో నిందితుడు మౌనంగా ఉండే హక్కు కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని నందిని సత్పతి కేసులో గౌరవ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మరీ ముఖ్యంగా ఆర్థిక నేరాల్లో అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పైన కేసు ఆధారపడి ఉంటుంది రెండు మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి, సాక్ష్యాలు తారుమారు చేస్తారని, చెబుతూ బెయిల్ ఇవ్వద్దని కోరడం లో అంతర్యం ఏమిటో ఎవరికైనా అర్థమవుతుంది. ప్రస్తుత తరుణంలో కేసులను కోర్టులకు వదిలేయకుండా మీడియా ట్రైల్స్ నడపడం సమాజానికి చేటు చేస్తుందని విషయం గమనించాలి.
బెయిల్ ఇజ్ రూల్ జైల్ ఇజ్ ఆప్షన్ అన్నది న్యాయ సూత్రం
ఇక్కడ చంద్రబాబుకి బెయిలు ఇవ్వాలా వద్దా అన్నది న్యాయస్థానం పరిధిలోని అంశం. కానీ విచారణ కాలంలో జైల్లో ఉంచాలన్న భావన వల్ల ఇబ్బంది పడేది సామాన్యుడే రాజకీయ నాయకులు గల్లి నుంచి ఢల్లీి దాకా వెళ్లి కొట్లాడగలరు కానీ సామాన్యుడు న్యాయాన్ని పొందడానికి ఖరీదైన న్యాయవాదులను నియమించుకోగలడా,??
విచారణ సమయంలో జైల్లో ఉంచినప్పుడు విచారణ అనంతరం కేసు కోర్టులో కేసు నిలబడకపోతే వ్యక్తి జైల్లో ఉన్న కాలాన్ని అనుభవించిన బాధను ఎలా పూడ్చగలం అది 16 నెలల పాటు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయిన ఇప్పుడు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అయినా అధికారంలో ఉండగా తెలంగాణలో నియంతలా వ్యవహరించి ఉండవచ్చు గాక.. వందల మంది ఉసురు పోసుకుని ఉండవచ్చు గాక వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఉండవచ్చు గాక … ప్రతి మనిషికి హక్కులు ఉంటాయి విషయాన్ని హక్కుల కోణంలోనే చూడాలి.
అమృతరావు
న్యాయవాది
కామారెడ్డి