నిజామాబాద్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు హాజరవుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా అధికారులకు సూచించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాని పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించడం జరిగిందని సిఎస్ దృష్టికి తెచ్చారు. సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. సీ.ఎస్ శాంతికుమారి మాట్లాడుతూ, ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హెలిపాడ్, కాన్వాయ్, సెక్యూరిటీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని మార్గ నిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రధాని పర్యటన ఏర్పాట్లను బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.