కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు ఎంతో పవిత్రమైనదని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు తమ నైతిక బాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్వీప్ కార్యకలాపాలలో భాగంగా ఓటరు నమోదు, ఓటు వినియోగం పై అవగాహన కలిగించుటకు కళాశాల స్థాయిలో స్థాయిలో నిర్వహించిన నాటక, పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల నమోదుకు, పారదర్శకమైన ఓటర్ల జాబితా రోపొందించుటకు ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది అన్నారు. అందులో భాగంగా యువ ఓటర్లు, భవిష్య ఓటర్లను ప్రజాస్వామ్యంలో బాగస్తులను చేయుటకు ఏడాదిలో నాలుగు సార్లు ఓటరు నమోదుకు అవకాక్షం కల్పించిందని అన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌తో పాటు వెబ్ సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఓటరుగా నమోదుకు విస్తృత అవకాశం కల్పించిందని అన్నారు. స్వీప్ కార్యకలాపాలు, స్పెషల్ డ్రైవ్ ద్వారా యువత నుండి మంచి స్పందన లభించిందని, చాలా మంది యువత ఓటరుగా నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న యువ ఓటర్లు, ఫ్యూచర్ ఓటర్లను అభినందించారు.
ఓటరుగా నమోదు చేసుకున్న మీకు త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించిందని, విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువుంటుంది, ఓటు ద్వారా సరైన వ్యక్తిని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేసేలా ప్రేరణ కల్పించవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు.గ్రామ గ్రామాన ఓటుహక్కు సద్వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే పోలింగ్ బూతులతో ప్రత్యేక దృష్టిపెట్టి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు.
కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, కళాశాల ప్రధానాచార్యులు కిష్టయ్య, విద్యాశాఖ ప్రతినిధి స్రేపతి, లెక్చరర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.